Post your question

 

    Asked By: prasanth

    Ans:

    మీరు 2013లో బీటెక్‌ డిస్‌కంటిన్యూ చేశారంటే, మీ వయసు దాదాపుగా 30 ఉండొచ్చు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉద్యోగానుభవం ఉంది కాబట్టి ఆ రంగంలో స్థిరపడితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు బీటెక్‌లో ఏ బ్రాంచిలో చేరారు అన్న విషయాన్ని చెప్పలేదు. మీరు డిగ్రీ పూర్తి చేయలేదు కాబట్టి ఎంబీఏ చదవడానికి అర్హత లేదు. బీఏ/బీకాం/బీబీఏల్లో మీకు నచ్చిన డిగ్రీని ఆన్‌లైన్‌/ దూరవిద్య ద్వారా పూర్తి చేయండి. ఆ తరువాత ఎంబీఏ- మార్కెటింగ్‌ కానీ, ఎంబీఏ- రియల్‌ ఎస్టేట్‌ కానీ చదివే ప్రయత్నం చేయండి. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయాలన్నా కనీసం డిగ్రీ విద్యార్హత అవసరం. మీ రియల్‌ ఎస్టేట్‌ ఉద్యోగానుభవం, సాఫ్ట్‌వేర్‌ రంగంతో సంబంధం లేకపోవడం, ఇంటర్‌కూ, పూర్తి చేయబోయే డిగ్రీకీ మధ్య అధిక వ్యవధి.. ఈ కారణాలతో సాఫ్ట్‌వేర్‌ రంగంలో మంచి ఉద్యోగం పొందడం కొంత కష్టమే. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కొనసాగిస్తూనే డిగ్రీ/ఎంబీఏ పూర్తిచేసి, రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనే మెరుగైన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    సాధారణంగా జర్నలిజం చదివినవారికి, ప్రభుత్వ రంగంతో పోలిస్తే, ప్రైవేటు రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువ. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో పబ్లిక్‌ రిలేషన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్లుగా చేరవచ్చు. దూరదర్శన్, ఆల్‌ ఇండియా రేడియోల్లోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి. జర్నలిజం చదివినవారికి ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్, దానికి సమానమైన రాష్ట్ర స్థాయి సర్వీసుల్లో కూడా అవకాశాలు లభిస్తాయి. మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌లో వివిధ విభాగాలైన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్‌ మీడియా మానిటరింగ్‌ సెంటర్, న్యూ మీడియా వింగ్, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో, పబ్లికేషన్స్‌ డివిజన్, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్స్‌ ఫర్‌ ఇండియాల్లో ఉపాధి ప్రయత్నాలు చేయవచ్చు. మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే- జర్నలిజం కళాశాలల్లో అధ్యాపకుడిగా స్థిరపడవచ్చు. జర్నలిజంలో శిక్షణ పొందినవారికి ప్రైవేటు రంగంలో విభిన్న ఉద్యోగావకాశాలు ఉన్నాయి. వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకొని కొంత ఉద్యోగానుభవం గడిస్తే వేతనం, హోదా కూడా పెరుగుతాయి. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినవారికి పెన్షన్‌ సదుపాయం లేదు. అందుకని ఉద్యోగ భద్రత మినహా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు పెద్దగా తేడా ఏమీ లేదు. ప్రైవేటు రంగంలో సర్వీసు, వయసుతో పనిలేకుండా ప్రతిభ ఆధారంగా పదోన్నతులూ, అధిక వేతనాలకు ఆస్కారం ఉంటుంది. జర్నలిజం రంగంలో ప్రైవేటు ఉద్యోగాల్లో సృజనాత్మకతకు అవకాశం అధికం. ప్రైవేటు రంగంలో మంచి ఉద్యోగం వస్తే నిరుత్సాహపడకుండా చేరి నైపుణ్యాలు మెరుగుపర్చుకోండి. అంతర్జాతీయ మీడియా సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: ఎం.నాగరాజు

    Ans:

    సాధారణంగా ఐఐఎంల్లో ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ ప్రోగ్రాం చేయాలంటే దాదాపు 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయల ఫీజు ఉంటుంది. బిట్స్‌ పిలానీలో 10 లక్షల నుంచి 12 లక్షల వరకు, ఎండీఐ - గుడ్‌గావ్, నార్సిమొంజి - ముంబయి, సింబయాసిస్‌ - పుణె, ఐఎంటీ- ఘజియాబాద్‌ల్లో 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పైన చెప్పిన అన్ని బిజినెస్‌ స్కూల్స్‌లో ఎంబీఏ చదవడానికి విద్యా రుణం వచ్చే అవకాశం ఉంది. స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ - యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఐదు లక్షల రూపాయల లోపే ఫీజు ఉంటుంది. దీనికి కూడా విద్యారుణం వెసులుబాటు ఉంది. ఐఐఎం/ ఐఐటీ, ఎండిఐ, ఐఎంటీల్లో ప్రవేశానికి క్యాట్, నర్సీమోంజిలో ప్రవేశానికి ఎన్‌ మ్యాట్, సింబయాసిస్‌లో ప్రవేశానికి స్నాప్, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ప్రవేశానికి సీయూఈటీ (పీజీ) పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనపరచాలి. తర్వాత రిటన్‌ ఎబిలిటీ టెస్ట్‌/ గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూల్లో కూడా ప్రతిభ చూపితే ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ ప్రోగ్రాంలో ప్రవేశం పొందవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: మెహరాజ్‌ షేక్‌

    Ans:

    అకౌంటింగ్, ఫైనాన్స్‌ రంగాల్లో సాంకేతికత వేగంగా పెరుగుతున్న ఈ తరుణంలో అకౌంటింగ్‌ నుంచి ఐటీ రంగానికి మారడం పెద్ద కష్టం కాదు. మైక్రోసాఫ్ట్‌ పవర్‌ బీఐ, ట్యాబ్లూ వంటి సాప్ట్‌వేర్‌లను నేర్చుకోవడం ద్వారా మీ నైపుణ్యాలనూ, తద్వారా ఉద్యోగ అవకాశాలనూ మెరుగుపర్చుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌ పవర్‌ బీఐ, ట్యాబ్లూల్లో సర్టిఫికెట్‌ పొందితే, ఐటీ రంగంలో మొదటి ఉద్యోగాన్ని పొందడం సులువు. వీటితో పాటు మైక్రోసాప్ట్‌ ఎక్సెల్, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్‌ ప్రోగ్రామింగ్‌లపై కూడా మంచి పట్టు సాధించాలి. ఒకవేళ పీజీ కోర్సు చేయాలనుకుంటే ఎంకాం (కంప్యూటర్స్‌) గురించి ఆలోచించవచ్చు. మేనేజ్‌మెంట్, డేటా సైన్స్‌ రంగాలపై ఆసక్తి ఉంటే, ఎంబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌) చదివితే ఉపయోగకరం. ఈ పీజీతో ఫైనాన్షియల్‌ అనలిటిక్స్‌ రంగంలోకి కూడా వెళ్ళవచ్చు. ఇటీవలి కాలంలో కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్‌ రంగాల్లో నైపుణ్యాలున్న వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా కాకుండా మీ క్లియరింగ్‌ అండ్‌ ఫార్వర్డింగ్‌ ఉద్యోగానుభవాన్ని ఉపయోగించి మంచి ఉద్యోగం పొందాలంటే బ్లాక్‌ చెయిన్‌/ లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా చదివే ప్రయత్నం చేస్తే మేలు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: ఎస్‌.రవిశంకర్‌

    Ans:

    మీరు ఇంజినీరింగ్‌ డిప్లొమా చదివి, ఉద్యోగం చేస్తున్నారని అనుకుంటున్నాం. బీబీఏను రెగ్యులర్‌గా చదువుతున్నారా? దూరవిద్యలోనా? ఆపరేషన్స్‌ ఇంజినీర్‌గా ఏ సంస్థలో, ఏ విభాగంలో పనిచేశారో/ పని చేస్తున్నారో చెప్పలేదు. యూనివర్సిటీలు ఇచ్చే ఎంబీఏ డిగ్రీకీ, ఏఐసీటీఈ అనుమతి ఉన్న రెండేళ్ల పీజీడీఎంకూ మధ్య తేడా లేదు. ఎంబీఏ డిగ్రీని ప్రభుత్వ/ ప్రైవేటు / డీమ్డ్‌ టుబీ యూనివర్సిటీలు ఇస్తే, పీజీడీఎం సర్టిఫికెట్‌ను మీరు చదివిన విద్యాసంస్థ ఇస్తుంది. కొంతకాలం క్రితం వరకు ఐఐఎంలు కూడా పీ‡జీడీఎం సర్టిఫికెట్‌ను మాత్రమే ఇచ్చేవి. ఇప్పటికీ ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న చాలా బిజినెస్‌ స్కూల్స్‌ పీజీడీఎం సర్టిఫికెట్‌ని ఇస్తున్నాయి. అందుకని మీరు ఎంబీఏ చేసినా, రెండేళ్ల పీ‡జీడీఎంను రెగ్యులర్‌గా చేసినా మీ ఉద్యోగావకాశాలకు ఇబ్బంది లేదు.
    ఎంబీఏ డిగ్రీని దూరవిద్యా విధానంలో కూడా చదవొచ్చు. ఎంబీఏ కానీ, పీజీడీఎం కానీ అత్యుత్తమ విద్యాసంస్థ నుంచి చేస్తేనే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ అవకాశాలు ఎక్కువ. చాలా ప్రైవేటు విద్యాసంస్థలు ఒక సంవత్సరం పీజీడీఎం సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నాయి. కానీ అలాంటి డిప్లొమాలు ఎంబీఏకు సమానం కాదు. పీజీడీఎం చదివి, భవిష్యత్తులో పీహెచ్‌డీ చేయాలనుకుంటే కొన్ని యూనివర్సిటీలు మీ పీజీడీఎం ప్రోగ్రాం, ఎంబీఏ ప్రోగ్రాంకు సమానం అని అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ (ఏఐయూ) ఇచ్చిన ధ్రువపత్రాన్ని అడుగుతున్నాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు ఈ ధ్రువపత్రం అవసరం లేదు. మీకు పది సంవత్సరాల ఉద్యోగానుభవం ఉంది కాబట్టి ఎంబీఏ/ పీజీడీఎం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్‌లకు సంబంధించిన ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌ విధానంలో చదివితే, నైపుణ్యాలు పెరగడం వల్ల మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: శ్రీనివాస్‌

    Ans:

    ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఎంసీఏ (మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) ప్రోగ్రాంలో ప్రవేశం పొందాలంటే డిగ్రీ లేదా ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో మాత్రం ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవకపోయినా ఎంసీఏలో చేరవచ్చు. కానీ అలాంటి విద్యార్థులు ఎంసీఏ మొదటి సంవత్సరం సబ్జెక్టులతో పాటు, మ్యాథమెటిక్స్‌ను బ్రిడ్జ్‌ కోర్సుగా చదివి ఉత్తీర్ణత సాధించాలి. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఎంసీఏ ప్రోగ్రాం విద్యార్హతలను ఏఐసీటీఈ ఇంకా ప్రకటించలేదు. జాతీయ విద్యావిధానం - 2020 పూర్తి స్థాయిలో  అమల్లోకి వస్తే ఏ డిగ్రీ చదివినవారైనా, ఏ పీజీ ప్రోగ్రాంలో అయినా ప్రవేశం పొందే వీలుంటుంది. కానీ, అంతకంటే ముందు ఇంటర్మీడియట్, డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇంటర్‌/ డిగ్రీలో మ్యాథ్స్‌ చదవనివారు ఎంసీఏ చదవడానికి అవకాశం ఉందో, లేదో తెలియాలంటే ఈ విద్యా సంవత్సరం ఐసెట్‌/ నిమ్‌సెట్‌ అడ్మిషన్ల నోటిఫికేషన్లు వచ్చేవరకు వేచి ఉండండి. ఇంజినీరింగ్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లాంటి ప్రొఫెషనల్, టెక్నికల్‌ కోర్సులకు మ్యాథ్స్‌లో ప్రావీణ్యం చాలా అవసరం. కాబట్టి గణితంలో బ్రిడ్జి కోర్సు చేసి.. నైపుణ్యాలు పెంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

     

    Asked By: ఐశ్వర్య

    Ans:

    ఆంధ్రా యూనివర్సిటీకి న్యాక్‌ గ్రేడింగ్‌ ఆధారంగా యూజీసీ గ్రేడ్‌ వన్‌ అటానమస్‌ హోదా కల్పించారు. దీనివల్ల యూనివర్సిటీకి కొత్త కోర్సుల రూపకల్పనకు అవసరమైన స్వయంప్రతిపత్తి ఉంటుంది. ఏదైనా యూనివర్సిటీ నిర్వహించే దూరవిద్య, ఆన్‌లైన్‌ ప్రోగ్రాంలకు యూజీసీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో (డెబ్‌) అనుమతి తప్పనిసరి. సాధారణంగా, ప్రభుత్వ యూనివర్సిటీలు జారీచేసే డిగ్రీల విషయంలో నియామక సంస్థలకు ఎలాంటి అనుమానాలూ ఉండవు. ఏదైనా పోటీ పరీక్షకు డిగ్రీ అనేది ఒక విద్యార్హత మాత్రమే. రాత పరీక్షలో, ఇంటర్వ్యూలో చూపే ప్రతిభపైనే మీ ఉద్యోగావకాశాలు ఆధారపడి ఉంటాయి. మీరు యూనివర్సిటీ నుంచి డెబ్‌ జారీ చేసిన అనుమతి పత్రాన్ని తీసుకొని భద్రపర్చుకోండి. భవిష్యత్తులో ఏదైనా ఇంటర్వ్యూలో అవసరం అయితే ఉపయోగపడవచ్చు. మీరు ప్రస్తుతం చదువుతున్న ఆన్‌లైన్‌ ఎంఏతో పీహెచ్‌డీ, ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌లతో పాటు అన్ని పోటీ పరీక్షలకూ అర్హులవుతారు. జాతీయ విద్యావిధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక రెగ్యులర్, డిస్టెన్స్, ఆన్‌లైన్‌ డిగ్రీలు అన్నింటికీ ఒకే రకమైన గుర్తింపు ఉండే అవకాశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: డి.సుజాత

    Ans:

    మీకు కోడింగ్‌ అంటే ఇష్టం లేదు కాబట్టి, సాప్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం పొందడం కష్టం. మీ వయసు ప్రకారం కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేదు. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్స్‌ ఉద్యోగాలకు గరిష్ఠ వయసు తెలంగాణలో 44 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్‌లో 42 సంవత్సరాలుగా ఉంది. సామాజిక రిజర్వేషన్లు ఉన్నవారికి మరో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు పది సంవత్సరాల వెసులుబాటు ఉంటుంది.
    ముందుగా మీకు కెరియర్‌లో విజయం పొందడం అనే విషయంపై స్పష్టత అవసరం. సాధారణంగా కెరియర్‌ నిర్ణయాలు వ్యక్తిగత ఆసక్తి, అభిరుచి, విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం, వయసు, విషయ పరిజ్ఞానం, భావప్రకటన సామర్థ్యం, కుటుంబ సహకారం, ఆర్థిక స్థోమత లాంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. మీ దృష్టిలో కెరియర్‌ అంటే ఉద్యోగమా? వ్యాపారమా? సామాజిక సేవా? దీనిపై స్పష్టత తెచ్చుకోండి. ఒకవేళ ఉద్యోగం అయితే, ప్రభుత్వ ఉద్యోగమా? ప్రైవేటుదా? ఈ వయసులో మీరు పోటీ పరీక్షలు రాయాలంటే, మీకంటే కనీసం 15 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న అభ్యర్థులతో పోటీ పడాల్సిఉంటుంది. ఏదైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి  కావాలి. మీరు ప్రస్తుతం నివసిస్తున్న ఊళ్లో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని, వాటిలో మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోండి. ఆ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మీకు ఆసక్తి ఉంటే, సైకాలజీలో పీజీ చేయండి. ఆపై కౌన్సెలింగ్‌లో డిప్లొమా చేసి, కౌన్సెలర్‌గా స్థిరపడొచ్చు. తక్కువ పెట్టుబడితో బేబీ కేర్‌ సెంటర్‌ కూడా ప్రారంభించవచ్చు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిరంతర కృషి ఉంటే ఎంచుకున్న కెరియర్‌లో వయసుతో సంబంధం లేకుండా రాణించవచ్చు. 
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: శివకుమార్‌

    Ans:

    సాధారణంగా బీఈడీ ప్రోగ్రాం వ్యవధి రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. మీరు బీఈడీ మూడో సంవత్సరం చదువుతున్నానన్నారు. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ ఎడ్‌/ బీఏఎడ్‌ ప్రోగ్రాం చదువుతున్నారని అనుకుంటున్నాం. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం ఎంఈడీ కోర్సును దూరవిద్యా విధానంలో అందించకూడదు. ఒకవేళ ఎవరైనా, అలా అందించే ప్రయత్నం చేస్తే ఆ ప్రోగ్రాంకు ఎన్‌సీటీఈ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోండి. మీకు టీచర్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలల్లో బోధించే ఆసక్తి ఉంటే, ఎంఈడీకి సమానమైన ఎంఏ ఎడ్యుకేషన్‌ చదివే ప్రయత్నం చేయండి. ఇగ్నో సంస్థలో ఎంఏ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం అందుబాటులో ఉంది. ప్రొఫెషనల్‌ కోర్సులను దూరవిద్య ద్వారా కాకుండా.. రెగ్యులర్‌గా చదివితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కరీమున్నీసా

    Ans:

    మీరు డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదువుతున్నారో చెప్పలేదు. డిగ్రీలో సోషియాలజీ/ సోషల్‌ వర్క్‌ చదివినవారికి సోషల్‌ వర్క్‌లో పీజీ చేయడానికి ప్రాధాన్యం ఉంటుంది. డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివినప్పటికీ మీకు సోషల్‌ వర్క్‌ సబ్జెక్టుపై ఆసక్తి ఉంటే, పీజీ సోషల్‌ వర్క్‌లో ప్రవేశం పొందవచ్చు. సోషల్‌ వర్క్‌ చేసినవారికి ప్రైవేటు రంగంలో ఎక్కువ ఉద్యోగావకాశాలున్నాయి. ఈ కోర్సులో పీజీ చేసినవారు ప్రైవేటు రంగంలో సోషల్‌ వర్కర్, ఫ్యామిలీ కౌన్సెలర్, హాస్పిటల్‌ కౌన్సెలర్, డీ అడిక్షన్‌ కౌన్సెలర్‌గా ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే,  కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగావకాశాలు ఉంటాయి.
    పీజీలో ఇండస్ట్రియల్‌ సైకాలజీ చదవాలంటే, ముందుగా ఎంఏ/ ఎమ్మెస్సీ సైకాలజీలో ప్రవేశం పొంది, ఇండస్ట్రియల్‌ సైకాలజీని ఒక స్పెషలైజేషన్‌గా చదవాలి. చాలా యూనివర్సిటీల్లో పీజీలో సైకాలజీ చదవాలంటే, డిగ్రీలో సైకాలజీ కచ్చితంగా చదివి ఉండాలి. కొన్ని యూనివర్సిటీలు మాత్రమే డిగ్రీలో సైకాలజీ చదవకపోయినా పీజీ సైకాలజీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇండస్ట్రియల్‌ సైకాలజీ చదివినవారికి ప్రైౖవేటు రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విద్యార్హతతో హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆర్గనైజేషనల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్, టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్, బిహేవియర్‌ అనలిస్ట్, హ్యూమన్‌ రిసోర్సెస్‌ ప్రాక్టీస్‌ మేనేజర్, ఎంప్లాయీ రిలేషన్‌షిప్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌ కోచ్, ఇండస్ట్రియల్‌ సైకలాజికల్‌ కౌన్సెలర్, కన్సల్టెంట్, రిసెర్చ్‌ అనలిస్ట్‌ లాంటి కొలువులకు అర్హత ఉంటుంది. ఇండస్ట్రియల్‌ సైకాలజీ చదివినవారికి ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో అతి తక్కువ ఉద్యోగాలే అందుబాటులో ఉన్నాయి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌